Vemana Padyalu
Vemana · पारंपरिक भक्ति पाठ
Verses 101–150
101
తనలోననె సకలంబును తనరందా నగుటయెఱిఁగి తారకమాత్మన్ దనువనుచుఁ బరిణమించిన మనుజునకును ముక్తికలదు మహిలో వేమా!
102
తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా తాను బుద్ధిదిరుగు ధరణిలోన తాను బుట్టుచోటు తత్వంబు తలపోయ విశ్వదాభిరామ వినర వేమ!
103
తనువు విడిచి తాను తరలిపోయెడివేళ తనదు భార్య సుతులు దగినవార లొక్కరైన నేగ రుసురు మాత్రమె కాని తనదుమంచి తోడు తనకు వేమ!
104
తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల నొనర శివునిఁజూడ నుపమగలదు మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో విశ్వదాభిరామ వినర వేమ!
105
తాము నిలుచుచోట దైవములేదని పామర జనులు తిరుపతులు దిరిగి జోకవీడి చేతిసొమ్మెలఁ బోఁజేసి చెడిగృహంబు తాను జేరు వేమ!
106
తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి తిరిపెమందుఁ దాను దిరిపె మిడినఁ దిరిపెము తిరిపమున దిగఁబడిపోవురా విశ్వదాభిరామ వినర వేమ!
107
తలఁచినను శూన్యతత్వము తలఁపక యుండినను శూన్యతత్వం బదియౌ తలఁచిన తలఁపీడేఱును దలఁచకయుండినను దానె తత్వము వేమా!
108
తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు ప్రమథగణము లఖిలబాంధవులు తనకుఁ బుట్టినిల్లు తనరుఁ గైలాసంబు విశ్వదాభిరామ వినర వేమ!
109
తెలివియైనలేక తిరమును తెలియక తిరుగునస్థిరుఁ డయి దేహి జగతి తిరుగ నేల యనుచుఁ దెలియఁడా యజ్ఞాని విశ్వదాభిరామ వినర వేమ!
110
తుంటవింటివాని తూపుల ఫూతకు మింటి మంట నడుమ మిడుకఁ దరమె యింటియాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినర వేమ!
111
తను వలచిన దావలచును తను వలవక యున్ననెనడు తావలవ డిలన్ తనదు పటాటోపంబులు తన మాయలు పనికిరావు ధరలోన వేమా!
112
తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ వెంట దేరు ధనము వంటబోరు తొనెటకు జనునొ ధనమెందు బోవునో విశ్వదాభిరామ వినుర వేమ!
113
తమ్ముడొనరచేయు దానమ్ములనుజూచి తనకు ఫలమటంచు మిణుకరాదు తనదు కాలు గోయ దనతమ్ము డేడ్చునా? విశ్వదాభిరామ వినురవేమ!
114
దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి చాడిచెప్పు పాపజాతినరుడు చాడిచెప్పువాడు సాయుజ్యమొందునా? విశ్వదాభిరామ వినురవేమ!
115
దానమడుగువాఁడు ధరలోన నధముండు దానమడుగఁడేని దైవసముఁడు దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా విశ్వదాభిరామ వినర వేమ!
116
ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి స్నేహితునికినైనఁ జెరపుచేయు నూహకలిగియుండు నోగుబాగులులేక విశ్వదాభిరామ వినురవేమ!
117
ద్వార బంధమునను తనయులు సంపద బంధువర్గ మెల్ల ప్రహరిగోడ మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా విశ్వదాభిరామ వినర వేమ!
118
దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి ఆవలి చూపుచూచు నతడె గురువు భ్రమరము తనరూపు క్రిముల కిచ్చినరీతి విశ్వదాభిరామ వినురవేమ!
119
దుష్టజనులగూడి తుంటరిపనులను శిష్టకార్యములుగ చేయుచుంద్రు కూడదనెడివారిగూడ నిందింతురు! విశ్వదాభిరామ వినురవేమ!
120
ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!
121
ధర గిరులు జలధు లన్నియు పరికింపగఁ బ్రళయమునను భస్మావృతులౌ సురలును మునులును జనఁగా నెరయోగులు నుండఁగలరె నేర్పున వేమా!
122
ధర్మసత్యములను దప్పకచేయని కర్మజీవి మేలుఁ గానఁలేఁడు నిర్మలహృదయుండు నీరూపమున నుండు విశ్వదాభిరామ వినర వేమ!
123
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల? చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినర వేమ!
124
నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు పాటిజగతిలేదు పరములేదు మాటమాటకెల్ల మనసు కోరుచునుండు విశ్వదాభిరామ వినర వేమ!
125
నిన్నుఁజూచుచుండ నిండును తత్వంబు తన్నుఁ జూచుచుండఁ తగులు మాయ నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును విశ్వదాభిరామ వినర వేమ!
126
నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ జక్కఁజేయరిల నసాధుజనము లొప్పుదుర్జనులను తప్పుగనెంతురు విశ్వదాభిరామ వినర వేమ!
127
నిరుపేదల రక్షించెడు సరసుఁడు నెఱవాతగాక సంపన్నులఁ దా భరియించువాఁడు దాతయె మెరమెచ్చులదాత యతఁడు మేదిని వేమా!
128
నీళ్లఁబోసి కడిగి నిత్యంబు శోధించి కూఁడుబెట్టి మీఁద కోకగట్టి యేమి పాట్లఁబడుదు రీ దేహమున కిల విశ్వదాభిరామ వినర వేమ!
129
నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు వ్రాఁతకన్న సాక్షి వలవ దెన్న పరగవ్రాతలేని పక్షానికప్పుడు సుద్దిసాక్షి తగనిబుద్ధి వేమా
130
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినుర వేమ!
131
పండువలనఁ బుట్టె పరఁగ ప్రపంచంబు పండువలనఁ బుట్టె పరము నిహము పండు కాసపడిరి బ్రహ్మాది సురలెల్ల విశ్వదాభిరామ వినర వేమ!
132
పగలురేయి మరచి భావంబు లోపలఁ దాను నేను ననెడు తలఁపు మఱచి యున్నయట్టి యతఁడు నుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినర వేమ!
133
పట్టుకొమ్మ లేక బలుపాట్ల బడువారు పెట్టిపోయ లేక తిట్టువారు ముట్టిశివునిపూజ మొదలు సేయరు వారు విశ్వదాభిరామ వినర వేమ!
134
పాడిగాదు జగతి పంచాంగములు సెప్పి కొంచమైన బుద్ధి నొందలేక బ్రహ్మ మెరుగ కిట్లు పౌరోహితముచేయ విశ్వదాభిరామ వినురవేమ!
135
పెద్దల వచనములఁ బ్రేమతోఁ జూచి తా నటుల నడవఁబోవ ననువుపడదు పులిని చూచి నక్క పూతఁపూసిన యట్లు విశ్వదాభిరామ వినర వేమ!
136
పప్పులేని కూడు పరుల కసహ్యమౌ నప్పులేనివాఁడె యధిక బలుఁడు ముప్పులేనివాఁడు మొదల సుజ్ఞానుఁడు విశ్వదాభిరామ వినర వేమ!
137
పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైన నియ్యజాలకవిధి నెసఁగువాఁడు పొట్టుఁదినెడులండి బువ్వలు పెట్టునా విశ్వదాభిరామ వినర వేమ!
138
ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చును ప్రభువు మంచికొరత ప్రజలకు సగము ప్రభు వొనర్చు చెడ్డ ప్రజల కేలరాదురా విశ్వదాభిరామ వినర వేమ!
139
పరధనమ్ములకును బారుగా చెయిపట్టి సత్యమింతలేక చారుఁడయ్యె ద్విజుఁ డనుకొనుఁదాదు తేజమింతయు లేక విశ్వదాభిరామ వినర వేమ!
140
ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువాని నోరె యమృతవాపి మారులేదు అనుదినంబుచూడ ననృతమాడెడినోరు నోరె కాదు క్రింది నోరు వేమ!
141
పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు పరఁగ నిచ్చె నేని పరము గల్గు పరముకన్న నేమి పావనమా సొమ్ము విశ్వదాభిరామ వినర వేమ!
142
పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ ద దలఁచిన నెవ్వ రేమనినఁ దన్నునుగాదని నవ్వుచుండు నా త్మలఁ దలపోయుచుండు నెఱ తత్వము నిత్యము దానయై సదా తెలిసినయోగి వేమనగతి శివరూపుఁడు నెల్లతావుల
143
పలుకుమన్న నేల పలుకక యున్నావు పలుకుమయ్య నాతో ప్రబలముగను పలుకుమయ్య! నీదు పలుకు నేనెఱిఁగెద విశ్వదాభిరామ వినర వేమ!
144
పుట్టుదుఃఖమునను పొరలుదుఃఖమునను గిట్టుదుఃఖమునను క్రిం దగుదురు మనుజదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినర వేమ!
145
పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁ బాపచింతఁజేయు జాపలమున మహిని కుంటినక్క మాంసముదిన్నట్లు విశ్వదాభిరామ వినర వేమ!
146
పూలగడ్డి కేల పుట్టించెనాపద కనకము తనకేమి కలుగజేసె బ్రహ్మచేతలెల్ల - పాడైన చేతలే విశ్వదాభిరామ వినురవేమ!
147
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమ!
148
బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు ప్రాణ మెవరిసొమ్ము భక్తిసేయ ధనమ దెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము విశ్వదాభిరామ వినర వేమ!
149
బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల ప్రోదియిడని బంధు భూతి యేల వ్యాధి దెలియలేని వైద్యుఁడు మఱియేల విశ్వదాభిరామ వినర వేమ!
150
బారెడేసి జడలు భస్మంబుపూఁతలు మరునితోడ మాఱుమలయఁ గలరు ముంజికోకలెల్ల లంజెకోకలాయె విశ్వదాభిరామ వినర వేమ!
Vemana Padyalu के बारे में
Vemana Padyalu are the short Telugu verses of Yogi Vemana, among the most quoted lines in Telugu. In plain, earthy words, each verse teaches a truth about life: the worth of a good character over birth or wealth, the folly of pride and hypocrisy, the emptiness of ritual without a pure heart, and the value of self-knowledge. Most verses end with the signature "Vishvadabhirama vinura Vema".
रचयिता: Yogi Vemana
कब पढ़ें: For reading and reflection, at any time, and in schools, where children learn them by heart.
क्या आप जानते हैं?
- Vemana is traditionally dated to around the 17th century, though accounts of his life vary.
- His verses are in the simple ataveladi metre, which makes them easy to remember.
- One of his best-known verses says that salt and camphor look alike but taste very different; so too, among people, the truly good stand apart.
अक्सर पूछे जाने वाले प्रश्न
Who was Vemana?
A Telugu poet and yogi, traditionally dated to around the 17th century.
What is his signature line?
"Vishvadabhirama vinura Vema".
What do his verses teach?
Plain truths about character, humility and sincere inner life.
उपासना और अध्ययन के लिए प्रस्तुत, भविष्यवाणी के रूप में नहीं। गैर-व्यावसायिक।